
రూ.10 నాణేలు చెల్లట్లేదు..
►రెండో దఫా డీమానిటైజేషన్‌లో నాణేలు వెనక్కి!
►పార్లమెంట్‌లో గళం విప్పిన విపక్ష ఎంపీలు
న్యూఢిల్లీ: ‘దుకాణదారులు రూ.10 నాణేల్ని తీసుకోవట్లేదు. ఎందుకని అడితే చెల్లవని సమాధానం చెబుతున్నారు. బ్యాంకులు కూడా నాణేల్ని తీసుకోవట్లేదు. అక్కడాఇక్కడని కాదు దేశమంతటా ఇదే పరిస్థితి. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?’ అని ప్రశ్నించారు జేడీయూ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ.
సోమవారం రాజ్యసభ జీరోఅవర్‌లో నాణేల చెల్లుబాటు అంశంపై గళం విప్పిన అన్సారీ.. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సభకు తెలిపారు. ఈ సందర్భంగా నాణేల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆసక్తికరమైన ప్రతిపాదన చేశారు.
రెండో ధఫా డిమానిటైజేషన్ ద్వారా నాణేలన్నీ వెనక్కి..
గత ఏడాది నవంబర్8నాటి డిమానిటైజేషన్ నిర్ణయాన్ని గుర్తుచేసిన ఎంపీ అన్సారీ.. మొదటి విడతలో పాత రూ.500, రూ1000 నోట్లను రద్దు చేసినట్లే రెండో దఫా డిమానిటైజేషన్ ద్వారా రూ.10, రూ.5, రూ.2, రూ.1 నాణాలను రద్దు చేసి, వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా భవిశ్యత్తులో నాణాలె చెల్లుబాటుపై ఎలాంటి సమస్యలూ తలెత్తబోవని ఎంపీ అన్సారీ అన్నారు. ఆయన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సిఉంది.
రాజ్యసభలో నేటి జీరో అవర్‌లో విపక్ష ఎంపీలు పలు సమస్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. నర్మదా నదిపై గల సర్దార్ సరోవర్ డ్యామ్ గేట్లను జులై 31 నుంచి మూసివేయాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అలా చేస్తే(గేట్లు మూసేస్తే) లక్షల కుటుంబాలు నీటమునుగుతాయని ఆందోళనవ్యక్తం చేశారు. ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలపై నామినేటెడ్ సభ్యుడు కేటీఎస్ తులసీ మాట్లాడారు. ఇటీవల అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని మోదీ హెచ్1బీ వీసాలపై మాటమాత్రమైన చర్చించలేదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఎం సభ్యుడు సీపీ నారాయణ తప్పుపట్టారు.