
వర్థమాన నటి సినిమా కలల్ని చిదిమేశాడు!
17 ఏళ్ల శిఖా (పేరు మార్చబడింది) వర్థమాన నటి.
17 ఏళ్ల శిఖా (పేరు మార్చబడింది) వర్థమాన నటి. వెండితెరపై కథానాయికగా కనిపించాలని కలలు కంది. ఆమెకు సినిమాల్లో అవకాశమిప్పిస్తానని నమ్మబలికిన ఓ 'పెద్దమనిషి'.. రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్టుచేశారు. మరొకడి కోసం గాలిస్తున్నారు. శిఖా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..
2014 జూలైలో ఆమె ఘజియాబాద్ యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలని, నటిగా రాణించాలని కలలు కంది. స్నేహితుడి ముసుగులో ఓ వ్యక్తి ఆమెకు సునీల్ కులకర్ణిని పరిచయం చేశాడు. తన సినీ పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి బాధిత మైనర్ బాలికను ట్రాప్ చేశాడు కులకర్ణి. 'అతను మా తల్లిదండ్రులను కలిశాడు. ముంబైలో తనకు చాలా పరిచయాలు ఉన్నాయని, తన వెంట ముంబైకి తీసుకెళ్లి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మా తల్లిదండ్రులకు చెప్పాడు. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా అతని వెంట పంపించేందుకు మా అమ్మనాన్నలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత అతను నన్ను ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఇక్కడి వసంత్‌కుంజ్‌లోని ఓ ఫ్లాట్ తీసుకొని నన్న ఉంచాడు. అక్కడ నాకు ఎప్పుడూ కొన్ని మాత్రలు ఇచ్చేవాడు. వాటని వేసుకుంటే నిద్రొచ్చినట్టు అయ్యేది.
ఇలా మూడునాలుగు నెలలు గడిచిన తర్వాత ఓ రోజు నాపై బలత్కార యత్నం చేశాడు. నేనా షాక్‌లో ఉండగానే కొన్ని ఫొటోలు తీశాడు. ఈ అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే ఆ ఫొటోలు మా తల్లిదండ్రులకు పంపిస్తానని భయపెట్టి.. నాపై అత్యాచారం జరిపాడు' అని బాధితురాలు తెలిపింది. అనంతరం 2015 ఆగస్టులో తనను ముంబై తీసుకొచ్చాడని, అప్పటి నుంచి గత ఆరు నెలలుగా తనపై అత్యాచారం జరుపుతున్నాడని ఆమె తెలిపింది. అతనే కాకుండా మరో వ్యక్తితో కూడా తనపై అత్యాచారం చేయించి.. వీడియో తీశాడని, దీని తల్లిదండ్రులకు చెప్తే వీడియోలు బయటపెడతానని హెచ్చరించాడని బాధితురాలు ఢిల్లీ వసంత్ కుంజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదుచేసిన పోలీసులు బాధితురాలిపై అత్యాచారం జరిపిన మరో నిందితుడిని పట్టుకునేందుకు కోసం గాలిస్తున్నారు.