విండోస్ 10లోకి మారతారా.. లేదా?
మీ దగ్గర అధునాతన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉందా? దాంట్లో ఓఎస్ ఏం వాడుతున్నారు? విండోస్ 7 గానీ, 8 గానీ వాడుతుంటే.. వెంటనే విండోస్ 10కు అప్‌గ్రేడ్ కావాలట. అందుకోసం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ విండోస్ యూజర్లను బలవంతపెడుతోంది. కోర్ ఐ3, ఐ5, క్వాల్‌కామ్ 8996 లాంటి ప్రాసెసర్లు ఉన్న యూజర్లందరూ తమ సిస్టంలను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని పదే పదే సందేశాలు వస్తున్నాయి. యూజర్లు విండోస్ అప్‌డేట్‌ను రన్ చేయడానికి ప్రయత్నిస్తే, కొత్త అప్‌డేట్లు రావడం లేదని, దానికి బదులు "కోడ్ 80240037 విండోస్ అప్‌డేట్ ఎన్‌కౌంటర్డ్ యాన్ అన్‌నోన్ ఎర్రర్'' అనే ఎర్రర్ సందేశం చూపిస్తోందని చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్లు వస్తుండటంతో వాటికి విండోస్ లేటెస్ట్ వెర్షన్ ఉంటేనే సపోర్ట్ చేస్తున్నాయని, అందువల్ల యూజర్లంతా వీలైనంత వరకు విండోస్ 10కు మారితేనే మంచిదని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు అన్నారు. పాత వెర్షన్లకు సపోర్ట్ ఇచ్చుకుంటూ పోవడం కంటే కొత్త వెర్షన్‌లో అయితే ఇప్పటికే సపోర్ట్ ఉన్నందున దానికి మారితే మేలని చెప్పారు. ఇప్పటికే ఎక్స్‌పీకి పూర్తిగా సపోర్ట్ తీసేసిన మైక్రోసాఫ్ట్.. ఇండోస్ 7కు కూడా కొంతకాలం తర్వాత సపోర్ట్ తీసేస్తామని ప్రకటించింది. ఈలోపే ఇప్పుడు విండోస్ 10కు మారాలంటూ చెబుతోంది. ఇంటెల్ స్కైలేక్ ప్రాసెసర్లు కూడా జూలై తర్వాత విండోస్ 7, 8ల మీద పనిచేయబోవని, అందువల్ల తప్పనిసరిగా యూజర్లు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మార్చుకోవాలని చెబుతున్నారు.