'విండోస్ 7కు అప్ డేట్స్ నిలిపేస్తున్నాం'
విండోస్ 7 కంప్యూటర్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆపరేటింగ్ సిస్టం. వినియోగదారుడికి అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మరికొద్ది సంవత్సరాలు మాత్రమే వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఈ మాట ఎవరో కాదు.. స్వయంగా మైక్రోసాఫ్ట్ సంస్థే ప్రకటించింది. సమకాలీన సాంకేతికతలో రోజు రోజుకూ వస్తున్న మార్పులు విండోస్ 7లో భద్రతా సమస్యలు సృష్టిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో వచ్చే మూడేళ్లలో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంకు భద్రతాపరమైన అప్‌డేట్లను పంపడం నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
భద్రతా సమస్యలను ఎదుర్కోవాలంటే వినియోగదారులకు ఎప్పుడూ ఓఎస్‌లో మార్పులు చేస్తూ కొత్త అప్‌డేట్లు పంపించాల్సి ఉంటుంది. అలాగే.. కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న ప్రింటర్లు, కీబోర్డులు, స్పీకర్లు, మౌస్‌లు తదితర హార్డ్‌వేర్ పరికరాలకు సపోర్ట్ చేయాలన్నా ఓఎస్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి సమస్యలను పరిష్కరించడం మైక్రోసాఫ్ట్‌కు తలకుమించిన భారంగా మారుతోంది. అందుకే 2020 జనవరి 13 నుంచి విండోస్ 7కు సెక్యూరిటీ సపోర్ట్ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తన బ్లాగులో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆ లోగా వినియోగదారులంతా విండోస్ 10కి మారాలని కోరింది.