'మాది పేదల సర్కార్'
నవాబుపేట (రంగారెడ్డి జిల్లా): 'మాది పేదల ప్రభుత్వం.. ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుంది' అని రాష్ట్ర రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుబ్బడిపత్తేపూర్, గంగ్యాడ, ముబారక్‌పూర్, తిమ్మరెడ్డిపల్లి, పూలపల్లిలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. అందుకు బృహత్తరమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారని స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలలోపు రైతు రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు.
'బంగారు తెలంగాణ' కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోనే నవాబుపేట మండలం వెనకబడిన మండలమని.. అధిక నిధులు వెచ్చించి ఈ మండలాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండుకు నిధులు మంజూరు చేసి ఉపయోగంలోకి తీసుక వస్తామన్నారు. బీటీ రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు వేస్తామని చెప్పారు.