
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అత్యాచారం!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ గది నెంబర్ 320లో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బాధిత బాలిక ఓ నగల షాపులో పనిచేస్తుంటుంది. ఆ షాపు యజమాని మాయమాటలు చెప్పి ఆ బాలికను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని గది నెంబర్ 320లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ ఘటనలో షాపు యజమాని మనోజ్ భగత్, రజత్ మదరేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్వార్టర్స్‌లో కార్యకర్తలు మినహా ఎమ్మెల్యేలు నివాసముండరు. సాధారణంగా వాటిలో చాలావరకు ఖాళీగానే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మనోజ్ ఆ బాలికను తీసుకుని వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అత్యాచారం ఎలా జరిగిందనే విషయం అంతుచిక్కడం లేదు. శివసేన నాయకురాలు నీలమ్ గోర్హే ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.