
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అతనే కరెక్ట్!
కీలకమైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించి.. సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో.. ఈ టెస్టులో టీమిండియాకు సారథ్యం వహించిన అజింక్యా రహానేపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను రహానేకు అప్పగిస్తే బాగుంటుందని ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. 'కెప్టెన్‌గా రహానేను కొనసాగించాలి. ఇది చాలా కఠినమైన సిరీస్. అయినా ఈ సిరీస్ ఆటగాళ్ల ప్రతిభతో బాగా సాగింది' అని జాన్సన్ ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.
కెప్టెన్ విరాట్ కోహ్లికి రాంచీ టెస్టులో భుజానికి గాయం కావడంతో అతను నాలుగో టెస్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మశాల టెస్టుకు నాయకత్వం వహించిన రహానే మైదానంలో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శరవేగంగా 38 పరుగులు చేశాడు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా ఈ సిరీస్‌లో ఆరో అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి బోర్డర్-గవస్కర్ ట్రోఫీని 2-1తో సొంతం చేసుకుంది.
అయితే, వాడీవేడిగా జరిగిన ఈ సిరీస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లను తాను స్నేహితులుగా పరిగణించబోనంటూ కెప్టెన్ కోహ్లి కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి కౌంటర్ ఇచ్చేందుకు జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడా? అని పరిశీలకులు భావిస్తున్నారు.