మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్లు కట్
శ్రీనగర్: గణతంత్ర వేడుకల సందర్భంగా కాశ్మీర్ లోయలో అన్ని మొబైల్ ఫోన్స్, వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్లను ఆపివేశారు. భద్రత చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్తగా ఈ సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
జమ్మూకాశ్మీర్లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మొబైల్, వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో అధికారులు ఇలాంటి నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. ఉగ్రవాదులు గతంలో మొబైల్ ఫోన్ల ద్వారా బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా లాండ్ లైన్ టెలిఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సర్వీసులు పనిచేస్తున్నాయి. గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తారు.