
కేజీబీవీ, మోడల్ స్కూళ్ల వద్ద పోలీసు భద్రత: కడియం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్ల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్న ట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు జిల్లాల ఎస్పీలతో పాఠశాలల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించామన్నారు. శనివారం ఆయన పాఠశాల విద్య డెరైక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 192 మోడల్ స్కూళ్లకు గాను 182 పనిచేస్తున్నాయని, గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఇవి పట్టణాలు, మండల కేంద్రాలకు దూరంగా విసిరేసినట్లున్నాయన్నారు.
అందుకే వీటిలో విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిం చినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాల వద్ద రాత్రివేళ ఒక మహిళా కానిస్టేబుల్, లేదా మహిళా హోంగార్డును నియమించాలని ఎస్పీలను ఆదేశించామన్నారు. ఎస్పీల సూచన మేరకు ప్రతీ పాఠశాలకు ప్రహరీ గోడ, సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.