
21 ఏళ్ల నాటి ఒప్పందం ద్వారా మాల్యాకు చెక్?
న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ కసరత్తు చేస్తోంది. 21 ఏళ్లనాటి ఒప్పందాన్ని వినియోగించుకొని మాల్యాకు చెక్ చెప్పాలని చూస్తోంది. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందం (ఎంఎల్ఏటీ) కింద మాల్యాను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఈడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. 1995 ఒప్పందం ప్రకారం విచారణలో తోడ్పడే చర్యల్లో భాగంగా నిర్బంధంలో ఉన్న వ్యక్తులను సహా బదిలీకి, లేదా కీలక సాక్ష్యం ఇవ్వడం కోసం ఆయా వ్యక్తుల తరలింపును దేశాలు కోరవచ్చు. ఈ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని మాల్యాను వెనక్కి రప్పించేందుకు ఈడీ ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల సీబీఐ మాల్యాపై చీటింగ్ నమోదు చేసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఉద్దేశపూర్తకంగా వేలకోట్ల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే చర్యల్లో భాగంగా గతంలో ఈడీ ..రెడ్ కార్నర్ నోటీసు జారీ జారీచేసి అతణ్ని భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. అయితే 1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని తాము ఆదేశించలేమని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మాల్యాను నేరస్తుడుగా గుర్తిస్తే తప్ప తరలించడం సాధ్యంకాదు. మరోవైపు భారతదేశ చర్యలు మాల్యా బ్రిటన్ కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. ఈ అంశాలను పరిశీలించిన ఈడీ తాజా చర్యకు పూనుకుంది.