పట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇలాకాలో పాగా వేసేందుకు బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకు నరేంద్రమోదీ ట్రోఫీని అస్త్రంగా ప్రయోగిస్తున్నది. నితీశ్ సొంత జిల్లా నలందాలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ పార్టీ విజయం సాధిస్తే.. బూత్ స్థాయిలో ఇన్‌చార్జులకు మోదీ ట్రోఫీని బహుమానంగా ఇవ్వనున్నట్టు ఆశపెట్టింది. ఈ ట్రోఫీ లేదా కప్‌పై ప్రధాని నరేంద్రమోదీ బొమ్మ చిత్రించి ఉంటుంది. ఈ నెల 28న నలంద జిల్లాలో మూడో దశ పోలింగ్ జరుగనుంది.
నితీశ్‌ను సొంత జిల్లాలోనే ఓడించి గట్టి దెబ్బతీయాలని భావిస్తున్న బీజేపీ ఇందుకు పార్టీ శ్రేణులకు ఈ తాయిలం ప్రకటించింది. మోదీ ట్రోఫీ ఆశతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఓటర్లను గణనీయంగా కమలం వైపు తిప్పుతారని భావిస్తున్నది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన సీఆర్ పాటిల్ ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.
బీహార్ ఎన్నికలకు బీజేపీ వ్యూహాకర్తల్లో ఒకరిగా ఉన్న సీఆర్ పాటిల్ గుజరాత్‌లోని నవ్‌సారి నియోజకవర్గం ఎంపీ. తొలిసారి ఆయన తన నియోజకవర్గంలో దుర్గా నవరాత్రి వేడుకలకు కూడా హాజరుకాకుండా.. బీహార్ ఎన్నికల్లో పార్టీ బూత్ స్థాయి వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన దసరా పండుగ వేడుకలో సైతం పాల్గొనకుండా బీహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. 'బూత్ జీతో.. చునావో జీతో' (బూత్ స్థాయిలో గెలువండి, ఎన్నికలు గెలువండి) అన్న బీజేపీ ఎన్నికల ప్రధాన సూత్రంలో భాగంగా కేవలం నలంద జిల్లాకే మోదీ ట్రోఫీ బహుమానాలు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.
నితీశ్ ఇలాకాలో మోదీ ట్రోఫీ!
Published Sat, Oct 24 2015 1:03 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement