రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి కేంద్రప్రభుత్వంపై అధికార టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు.
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని, కేంద్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ పాషా అన్నారు. గుంటూరులో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ అనంతపురంలో 107మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజధాని శంకుస్థాపన సంబరాలు పేరిట దోచుకుంటున్నారని అన్నారు.
మరోవైపు రాజధాని నిర్మాణానికి విరాళాల పేరిట హుండీలు పెట్టి ప్రజలను అందులో డబ్బులు వేయాలని కోరుతున్నారని, ఈ పరిస్థితులు రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉందో తెలుపుతున్నాయని అన్నారు. జగన్ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు లభిస్తున్నదని, దీక్ష తరలివచ్చిన జనంతో గుంటూరు నిండిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పణంగా పెట్టి జగన్ దీక్ష చేస్తున్నారని, ఇలాంటి నేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం తమ అదృష్టంగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద పణంగా పెడుతున్నారని విమర్శించారు.