ఇక స్మార్ట్ ఫోన్లతో ఓట్లు!!
మొన్నటి వరకు బ్యాలెట్ పేపర్ల మీద స్వస్తిక్ గుర్తు ముద్ర వేసి.. వాటిని బ్యాలెట్ బాక్సులలో వేయడమే ఓటింగ్ విధానం. అవిపోయి ఈవీఎంలు వచ్చేసి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ఎవరి చేతిలోచూసినా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఓటుహక్కు ఉన్నవాళ్లలో చాలామంది సమయం చిక్కక, ఓపిక లేక పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లట్లేదు. ఇలాంటి సమస్యలను అధిగమించి, ప్రజాస్వామ్యంలో ఎక్కువ పోలింగ్ జరిగేలా చూసేందుకు స్మార్ట్ ఫోన్లతో ఓట్లు వేయించే విధానం ఉంటే ఎలా ఉంటుంది?
సరిగ్గా ఇలాంటి ఆలోచనే అమెరికాలో పరిశోధకులకు వచ్చింది. సంప్రదాయ ఓటింగ్ స్థానే స్మార్ట్ఫోన్ల ఆధారిత ఓటింగ్ విధానాన్ని వాళ్లు రూపొందించారు. ఈవీఎంలతో అనేక సమస్యలున్నాయని, వాటన్నింటినీ అధిగమించి ఈ విధానాన్ని రూపొందించామని టెక్సాస్లోని రైస్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ మైఖేల్ బైర్న్ తెలిపారు. మిగిలిన అన్ని రకాల ఓటింగ్ విధానాల కంటే స్మార్ట్ ఫోన్లతో ఓటింగులో చదువు అంతగా లేనివారు కూడా చాలా తక్కువ తప్పులు చేసినట్లు ఆయన చెప్పారు. పోలింగ్ రోజు తమకు కుదిరినప్పుడు ఓటు వేయచ్చని, ఉద్యోగానికి వెళ్లినా కూడా ఆఫీసులోంచే ఓటు వేసుకోవచ్చని.. ఇలాంటి ఓట్లను అధికారులు ధ్రువీకరించిన తర్వాతే అవి పోలవుతాయని వివరించారు. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనే జర్నల్లో ఈయన పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి.