కరెన్సీ కోసం మన ఎంపీలు కూడా..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చాలా బ్యాంకుల్లో కరెన్సీ నిండుకుంది. వివిధ రాష్ట్రాల్లోనూ చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి. డిమాండ్‌కు సరిపడా కొత్త నోట్లను రిజర్వ్ బ్యాంకు.. బ్యాంకులకు పంపడం లేదు. దీంతో చాలా బ్యాంకుల్లో కేవలం పాత నోట్లను డిపాజట్ చేయించుకుంటున్నారు. జీతం వచ్చినా నెల మొదట్లో నగదు అందుబాటులో లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, వ్యాపారులు అన్ని వర్గాల వారు కరెన్సీ కోసం కష్టాలు పడుతున్నారు. మన ఎంపీలు మాత్రం జీతం రాగానే సరిపడా డబ్బు విత్ డ్రా చేసుకుంటున్నారు.
నవంబర్ 30 తేదీన అంటే బుధవారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జీతాలు వచ్చాయి. చాలా మంది ఎంపీలు ఆలస్యం చేయకుండా నగదు తీసుకునేందుకు పార్లమెంట్ భవనంలోని ఎస్‌బీఐ బ్రాంచికి వెళ్లారు. నిన్న 300 మందికి పైగా ఎంపీలు డబ్బు విత్ డ్రా చేసుకున్నారు. వీరిలో చాలామంది వారానికి విత్ డ్రా చేసుకోగలిగే గరిష్ట పరిమితి నగదు తీసుకున్నట్టు ఓ బ్యాంకు అధికారి చెప్పారు. అందరిలాగే అవసరాలకు, ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చేందుకు డబ్బు అవసరమని ఓ సీనియర్ ఎంపీ చెప్పారు. నిన్న రాజ్యసభ వాయిదా పడిన వెంటనే కొందరు ఎంపీలు నేరుగా బ్యాంకు వెళ్లి నగదు తీసుకున్నారు. ఎంపీల రాకతో బ్యాంకు రద్దీగా మారింది. ఎంపీలకు, వారి సిబ్బంది కోసం బ్యాంకు అధికారులు నిరంతరాయం పనిచేసి డబ్బు అందజేశారు. అలాగే పార్లమెంట్‌లోని ఏటీఎంల ముందు సిబ్బంది డబ్బుల కోసం క్యూ కట్టారు.