ఆ ట్రైలర్ చూసి.. తండ్రి గుండె ఉప్పొంగింది!
'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమా కోసం ధోనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
రాంచీలోని ఓ మూరుమూ వీధి నుంచి ఇండియన్ క్రికెట్ కారిడర్‌లోకి, ప్రపంచ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఒక దిగ్గజంగా ధోనీ ఎలా ఎదిగాడు? అతని జీవితంలో బయటిప్రపంచానికి తెలియని రహస్యాలేమిటి? తదితర అంశాలను స్పృశిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. ధోనీ కూల్ స్టైల్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అందుకే సినిమాను చూసేందుకు దేశమంతటా యువత ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో 'ఎంఎస్ ధోనీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగుచూసింది. టీవీలో ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన ప్రతిసారి ధోనీ తండ్రి పాన్ సింగ్ ఉద్వేగానికి లోనవుతున్నారట. దేశంలో గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన ధోనీని చూసి గర్వపడుతూనే.. అతను ఈ స్థాయి చేరుకోవడానికి పడ్డ కష్టం, అతని అకుంఠిత దీక్ష, పట్టుదల గుర్తొచ్చి ఆయన కళ్లు చెమరుస్తున్నాయి. తన కొడుకు పడిన కష్టం ఈ సినిమా ట్రైలర్ గుర్తుచేస్తుండటంతో.. ట్రైలర్ చూసిన ప్రతిసారి ఆయన ఒకింత భావోద్వేగానికి లోనవుతున్నారని సన్నిహితులు తెలిపారు. సుశాంత్ రాజ్‌పుత్ ధోనీగా నటించిన ఈ సినిమాను నీరజ్ పాండే తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్ స్టూడియో, అరుణ్ పాండే ఈ సినిమాను నిర్మించారు.