ఆగస్ట్ 2 వరకూ ముద్రగడ హౌస్ అరెస్ట్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కిర్లంపూడిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. అంతేకాకుండా ముద్రగడను వచ్చే నెల 2వ తేదీ వరకూ గృహ నిర్భంధం చేస్తున్నట్లు చేశారు. కాగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సెక్షన్ 144 (3) ప్రకారం ముద్రగడను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎస్డీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. కాగా నిన్న 24 గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇవాళ ఏకంగా వారం పాటు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ‘నేను అంతర్జాతీయ తీవ్రవాదినా? నాపై కేసులుంటే అరెస్ట్ చేసుకోండి. మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర‍్తిస్తున్నారు. పోలీసులు అణిచివేత ధోరణి మానుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆగస్ట్ 3వ తేదీ ఉదయం 9గంటలకు బయటకు వస్తా. పాదయాత్ర చేస్తా’ అని తెలిపారు. మరోవైపు ముద్రగడ మీడియాతో మాట్లాడేందుకు కాపు నేతలు అనుమతి కోరారు.