‘చలో అమరావతి’పై ఉక్కుపాదం
- ఇటు హక్కుల పోరు..
- అటు అణచివేత హోరు
- కిర్లంపూడి దారులన్నీ బంద్.. సాయుధ బలగాల కవాతు
-‘తూర్పు’ దిగ్బంధం.. పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ తనిఖీలు
- పాదయాత్ర చేసి తీరతామంటున్న ముద్రగడ.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి అమరావతి: గజానికో పోలీసు చెక్‌పోస్టు.. కిలోమీటర్‌కో బారికేడ్... అడుగడుగునా నిఘా.. వీధివీధినా ఖాకీల బూట్ల చప్పుళ్లు.. తుపాకులతో సాయుధ దళాల కవాతు.. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే నిఘా నేత్రాలు.. నోటీసులు, అరెస్టులు, బైండోవర్ కేసులు.. ఇదీ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో పరిస్థితి. కాపు రిజర్వేషన్ల పోరాట సమితి కార్యక్షేత్రం కిర్లంపూడి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. కిర్లంపూడిలో సాయుధ బలగాల కవాతు చూసి జనం విస్తుపోతు న్నారు. ‘కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను బలహీన వర్గాల జాబితాలో చేర్చుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే కదా వారు అడుగుతున్నారు. అందుకోసమే కదా ‘చలో అమరావతి’ పాదయాత్ర చేస్తున్నారు.
దానిపై ఇలా ఉక్కుపాదం మోపడమేమిటా’ అని జనం ఆశ్చర్యపోతున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన స్వగ్రామమైన కిర్లంపూడి నుంచి బుధవారం ‘ఛలో అమరావతి’ పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. ఆయన ఇలా పాదయాత్రకు పూనుకోవడం ఇది మూడోసారి. పాదయా త్రను అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం, చేసి తీరుతామని కాపు నేతలు భీష్మించడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం కిర్లంపూడిలో ఏమి జరుగనున్నదన్న ఉత్కంఠ నెలకొంది. ముద్రగడ సహా కాపు నేతలు ఆకుల రామకృష్ణ, ఏసుదాసు, నల్లా విష్ణు, ఆరేటి ప్రకాశ్ వంటి ప్రముఖులందర్నీ ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు.
వేలాది మందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసుల వలయంలో చిక్కుకుంది. ఏడు వేలకుపైగా బలగాలతో జిల్లాను దిగ్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 చెక్‌పోస్టులు, 116 పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలు సహా వివిధ ప్రాంతాల్లో సెక్షన్ 144, 30ని ప్రకటించారు. నలుగురికి మించి గుమికూడకుండా, కలిసి నడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. సచివాలయానికి వెళ్లే దారిలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు.
కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం
పాదయాత్ర ప్రారంభమయ్యే కిర్లంపూడి గ్రామం పోలీసుల దిగ్బంధంలో ఉంది. భారీ ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్ ఫోర్స్, తదితర బలగాలు ఎక్కడికక్కడ మాటు వేసి ఉన్నాయి. కిర్లంపూడికొచ్చే దారులన్నీ దాదాపు మూసేస్తున్నారు. ఏదో ఒక ఐడీ కార్డు చూపిస్తే తప్ప ఆ గ్రామస్తులను కిర్లంపూడిలోకి రానివ్వడం లేదు.
అన్ని ఏర్పాట్లతో ముద్రగడ సన్నద్ధం
షెడ్యూల్ ప్రకారం ‘చలో అమరావతి’ పాదయాత్రను బుధవారం ప్రారంభించేం దుకు ముద్రగడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యమానికి సహకరిస్తున్న వారందరికీ తమ వేగుల ద్వారా సమాచారం పంపించారు. అంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరదామని సంకేతాలు పంపించారు. పోలీసులు వ్యూహ ప్రతి వ్యూహాలకు, ఎత్తుకు పైఎత్తులను గమనిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే కాపునేతలెవరూ కిర్లంపూడి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా కాపు నేత కిర్లంపూడికి వస్తే ఆ డివిజన్ సూపరింటెండెంట్, సీఐ, ఎస్‌ఐలే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది.
నేటి కార్యక్రమం ఇలా...
ముద్రగడ అనుచరుల కథనం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు ఆయన తన అనుచరులతో భేటీ అవుతారు. అల్పాహారం అనంతరం ఇంటి నుంచి బయటకు వస్తారు. కుటుంబ సభ్యులు వీడ్కోలు పలుకుతారు. 9.30 గంటలకు ఇంటి గేటు దాటుతారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే తన అనుచరులు పాదయాత్రను కొనసాగిస్తారు.
అనుమతి లేదు: డీజీపీ
ముద్రగడ యాత్రకు అనుమతి లేదని, ఆ యాత్రలో ఎవరూ పాల్గొనవద్దని డీజీపీ సాంబశివరావు మరోసారి హెచ్చరించారు. కిర్లంపూడిలోని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే యాత్రకు అనుమతి లేదని, లోనికి వెళ్లాలని కోరతామని, ఆయన ఇంటిలోనికి వెళ్లిపోతారని భావిస్తున్నామ న్నారు. ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పద్మనాభం అసలు యాత్రకు అనుమతి కోరలేదని చెప్పారు. ఒక జిల్లా పరిధి దాటిన కార్యక్రమాలకు డీజీపీ అనుమతివ్వాల్సి వుంటుందని, కానీ తన వద్దకు ఎటువంటి దరఖాస్తు రాలేదన్నారు.