కాంగ్రెస్ పార్టీకి నష్టమే : వీహెచ్
నార్కట్‌పల్లి న్యూస్‌లైన్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ కాకుండా, రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతుందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదిజిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారన్నారు. తెలంగాణ రాష్ర్టం కాకుండా, ఒకవేళ రాయల తెలంగాణ ఇస్తే తిరిగి ఉద్యమిస్తామని చెప్పారు.
మేం పూర్తిగా వ్యతిరేకం : సీహెచ్. విద్యాసాగర్‌రావు
నల్లగొండ, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్. విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుందన్నారు. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ 12 జిల్లాలతో కూడిన రాష్ట్రం ఇస్తామంటూ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని కుట్ర చేస్తుందని విమర్శించారు.
ఈ ప్రతిపాదన ఓ బలవంతపు పెళ్లి : దాసోజు శ్రవణ్‌కుమార్
కనగల్, న్యూస్‌లైన్ : రాయల తెలంగాణ నిర్ణయం బలవంతపు పెళ్లి లాంటిదని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కనగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు 1956లో ఆంధ్రకు, తెలంగాణకు బలవంతంగా పెళ్లి చేసి వేలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు అదే తరహాలో రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలపాలని చూస్తుందని విమర్శించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను తాము ఒప్పుకోమన్నారు.
మరో మహోద్యమం తప్పదు : సీపీఐ ఎమ్మెల్యే మల్లేష్
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : కేంద్రం రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మరో మహోద్యమం చేపడతామని సీపీఐ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే గుండా మల్లేశ్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ రాష్ట్రం కావాలని అనంతపురం, కర్నూలు ప్రాంతాల ప్రజలు ఏనాడూ కోరలేదన్నారు. అయినా, స్వార్థపూరితంగా కొందరు రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్‌లో రాయల తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకొని తీరుతామన్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు.
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విజయయాత్ర రెండో రోజైన మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప రాయల తెలంగాణ వద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబులు ఇప్పుడు సమైక్యాంధ్రనడం సిగ్గు చేటన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ 2004లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాయల తెలంగాణపై ఎవరేమన్నారంటే...
Published Tue, Dec 3 2013 11:06 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement