మహారాష్ట్రను విభజించే ధైర్యమా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర విభజన గురించి ప్రతిపక్ష పార్టీలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్రమోదీ విస్పష్టంగా తిప్పికొట్టారు. తాను ప్రధానిగా ఉన్నంతకాలం ఏ శక్తి కూడా మహారాష్ట్రను విడదీయడం కానీ, మహారాష్ట్ర నుంచి ముంబైని వేరుచేయడం కానీ చేయలేదని తేల్చి చెప్పారు. ‘ఛత్రపతి శివాజీకి చెందిన ఈ గడ్డను విభజించే ధైర్యమున్నవాడు ఈ భూమ్మీద ఎవరైనా పుట్టాడా?’ అంటూ మిన్నంటిన సభికుల హర్షధ్వానాల మధ్య ప్రశ్నించారు.
మహారాష్ట్రను విడదీసి ముంబై రాజధానిగా ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రహస్య ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఎంఎన్‌ఎస్‌లు ప్రచారం చేస్తుండటంపై మోదీ తీవ్రంగా స్పందించారు. గత దశాబ్ద కాలంగా పత్తి, ఉల్లిగడ్డల ధరలపై ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేసిన కాంగ్రెస్.. తాజాగా ఈ కొత్త అబద్ధాన్ని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ముంబైలేని మహారాష్ట్ర అసంపూర్ణమని వ్యాఖ్యానిస్తూ.. ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందేందుకు బీజేపీయేతర పార్టీలు ఈ తరహా వదంతులను ప్రచారం చేస్తున్నాయన్నారు. ధూలే, జల్గావ్, నాగపూర్‌లతో సహా పలు ప్రచార ర్యాలీల్లో మంగళవారం మోదీ పాల్గొన్నారు. ధూలేలో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో గత 15 ఏళ్ల కాంగ్రెస్, ఎన్సీపీల పాలనలో రాష్ట్రంలో ఒక తరం నాశనమైంది. యువకులకు ఉపాధి లేదు. మహిళలకు రక్షణ లేదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ వారే అధికారంలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలకు వారు బాధ్యులు కాదా? వారిని శిక్షించేందుకు ఇప్పుడు సమయం వచ్చింది. మరి శిక్షిస్తారా లేదా?’ అని భారీగా హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.
ఉల్లి తిన్న విశ్వాసం: ‘60 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారో చెప్పుకోలేని వారు.. 60 రోజుల్లో నేనేం చేశానో చెప్పాలని సిగ్గులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘మన్మాడ్- ఇండోర్ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తామంటూ అనేక ఎన్నికల్లో వారు విజయం సాధించారు. కానీ ఒక్క అంగుళం పని కూడా చేయలేదు’ అంటూ కాంగ్రెస్ వారిలా తాను తప్పుడు హామీలు ఇవ్వబోనన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ‘ధులే, నందుర్బార్‌లను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తాం. నేను బాల్యం నుంచి ఉల్లి తింటున్నాను. మాకు ఉల్లి అందించిన ఈ ప్రాంతవాసులను నిరాశపరచను. పూర్తిమెజార్టీతో రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉల్లి రైతుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం’ అని స్థానిక రైతులకు హామీ ఇచ్చారు. నిరుపేదల గుడిసెలను సందర్శించి ఫొటోలు దిగిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ.. ‘నిరుపేదల ఇళ్లు సందర్శించానని చెప్పుకునేందుకు ఫొటోలేం నా దగ్గర లేవు. కానీ నేను పుట్టిందే పేద కుటుంబంలో’ అని చురకలంటించారు. ఐదేళ్ల పాలన పూర్తి అయిన తరువాత తానిచ్చిన ప్రతీ హామీపై ప్రజలకు సమాధానం చెబుతామని మోదీ తెలిపారు.
గడ్కారీపై బూటు దాడికి యత్నం
సాక్షి, ముంబై: కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీపై బూటు దాడికి విఫలయత్నం జరిగింది. సోమవారం మహారాష్ట్రలోని పుణేలో కోత్‌రోడ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గడ్కారీని సభ నిర్వాహకులు పూలు చల్లుతూ ఆహ్వానిస్తుండగా, భరత్ కరాడ్(37) అనే వ్యక్తి తన బూటును ఆయనపై విసిరేందుకు యత్నించాడు. ఇది గమనించిన బీజేపీ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. కరాడ్ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు సమాచారం.