200 బ్రాండ్లను తొలగిస్తున్న మింత్ర?
బెంగళూరు: దేశ అతిపెద్ద ఆన్ లైన్ ఫ్యాషన్ రీటైలర్ మింత్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గత ఏడాది కొనుగోలు చేసిన ఫ్యాషన్ పోర్టల్ మింత్రా దాదాపు 200 బ్రాండ్లను డీలిస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కనీసం 10 శాతం ఉత్పత్తులను తమ వ్యాపారంనుంచి తొలగిస్తున్నట్టు సమాచారం. తక్కువ ఆదరణ ఉన్న ఉత్పత్తులను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించి, ప్రముఖ బ్రాండ్లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందిట. ప్రస్తుతం నైక్, అదిదాస్,పూమా, లీ, లివైస్, యారో, క్యాట్,హార్లీ డేవిడ్ సన్, ఫెరారి తదితర 25 అంతర్జాతీయ బ్రాండ్లను ఆన్ లైన్ లో విక్రయిస్తోంది.
అమ్మకాల పరంగా బలహీనంగా ఉన్న బ్రాండ్లను తొలగించిన మింత్రా పెద్ద బ్రాండ్ దృష్టి సారించిందని బెంగుళూరు ఆధారిత కంపెనీ మింత్రా సన్నిహితులు తెలిపారు. 150-200 బ్రాండ్లను తొలగిస్తోందనీ, భవిష్యత్తులో మరిన్నింటిని తొలగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రోజుకు రెండు మూడు మాత్రమే విక్రయిస్తున్న బ్రాండ్లను తొలగించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి మింత్రా నిరాకరించింది.
కాగా మింత్రా కూడా ప్రపంచ బ్రాండ్లపై దృష్టి పెడుతుందనీ సీఈవో అనంత్ నారాయణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాదికి బిలియన్ డాలర్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. స్థిరమైన వృద్ధి రేటుతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అధికలాభాలు గడించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఫరెవర్ 21 మింత్రా లో రంగప్రవేశంతో మింత్రా ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే.