ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్‌లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.
బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్‌పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు.
దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment