యుఐడిఎఐ-ఆధార్ ప్రాజెక్టు చైర్మన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయనను పోటీకి దించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి నందన్కు పోటీకి దింపాలని సోనియా తనయుడు తలపోస్తున్నాడు.
ఎన్నికల్లో పోటీపై నిలేకని స్పందించకపోయినప్పటికీ కాంగ్రెస్ వర్గాలు ఫీలర్లు వదులుతూనే ఉన్నాయి. ఆయనను తమ పార్టీ తరపున లోక్సభ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నాయి. నందన్ నిలేకని 2009లో ఇన్ఫోసిస్ కంపెనీ ని వదిలి యుఐడిఎఐ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. యూపీఏ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చింది. బెంగళూరు సౌత్ నుంచి ప్రస్తుతం బీజేపీ సీనియర్ నాయకుడు అనంతకుమార్ లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.