ఇపుడున్న ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవట..!
హైదరాబాద్: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని యువకులకు షాకిచ్చే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఉనికిలో ఉన్న ఉద్యోగాలు చాలా వరకు భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఏదో ఒకటి చేయాలని, విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాల శిక్షణలోనూ, విద్యావ్యవస్థలో పూర్తి మరమ్మతుల అంశాల సమగ్ర పరిశీలనపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు.
ఎడ్యుకేషన్ సిస్టంలో వినూత్నమైన మార్పులతోపాటు, సృజనాత్మకత ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాలని సోమవారం పీటీఐకి చెప్పారు. ఈ తరహా నైపుణ్యాల పెంపు ద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా (యుఐడిఎఐ) మాజీ చైర్మన్ నీలేకని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు జీవితాంతం నేర్చుకునే పనిలో ఉంటూనే, కొత్త కొత్త నైపుణ్యాలు, ఆలోచనలను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యావ్యవస్థలో మార్పులు రావాలని కోరారు. ఈ విషయంలో ఒక పెద్ద మార్పు అవసరం ఉందని నీలేకని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంజిలిజెన్స్ , బాట్స్ లాంటివి సాఫ్ట్ వేర్, బీపీఓ రంగంలో దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో మరిన్ని కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు పొందడం గతంలో ఉన్నంత తేలిక కాదన్నారు. ఆ వైపుగా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. భారతదేశం యొక్క 7-8 శాతంగా జీడీపి వృద్ధి రేటు నిరుద్యోగానికి కారణమా అన్న ప్రశ్నకు దేశీయ సేవలపై దృష్టిపెట్టాలని నీలేకని చెప్పారు.