నాడు 200.. నేడు 7700 కోట్లు!!
నందన్ నీలేకని.. ఆధార్ కార్డుల పుణ్యమాని దేశం మొత్తానికి తెలిసిన పేరిది. ఒకప్పుడు నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించిన వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తున్న సందర్భంగా, తన ఆస్తుల విలువ 7,700 కోట్ల రూపాయలని ప్రకటించి సంచలనం సృష్టించారు. బహుశా ఈ ఎన్నికల్లో ఆయనకంటే ధనవంతుడైన అభ్యర్థి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, 1978లో ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదవిన తర్వాత ఉద్యోగావకాశం వస్తే తనకొద్దని విదిల్చికొట్టేనాటికి ఆయన జేబులో ఉన్నవి కేవలం 200 రూపాయలే!! అక్కడినుంచి ఇప్పుడు దాదాపు 8వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించే స్థాయికి ఎదిగారు.
బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నందన్ నీలేకనికి నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన కోరమంగళ వద్ద రిసార్టు లాంటి ఇల్లు, లెక్కలేనన్ని విలాసవంతమైన కార్లు.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. తనకు ఇప్పటికే బోలెడంత డబ్బుందని, ఇప్పుడు డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావట్లేదని నీలేకని అన్నారు. మార్పు తేవడం కోసమే వస్తున్నానన్నారు. తాను నిజాయితీగా సంపాదించానని, అంతా ప్రకటించానని చెప్పారు. నందన్ నీలేకని సంపాదనలో అత్యధిక భాగం ఆయనకు, ఆయన భార్య రోహిణికి ఇన్ఫోసిస్లో ఉన్న షేర్ల రూపంలోనే ఉంది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్లో వీళ్లిద్దరికీ కలిపి 3శాతం షేర్లున్నాయి.