
'పాఠాలు నేర్చుకున్నా, ఇంకెప్పుడూ రాజీనామా చేయను'
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపలేరని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ప్రధాని మోడీ ఆధారంగానే జరిగాయని గురువారం ఓ ఆంగ్ల ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చివరకు ఫడ్నవిస్, ఖత్తర్ ముఖ్యమంత్రులు అయ్యారని అన్నారు. హర్యానా, మహారాష్ట్రలలో వేరే ఆప్షన్ లేదని, అయితే ఢిల్లీలో ఆప్ రూపంలో ప్రత్యామ్నాయం ఉందన్నారు.
తనకు ఎదురైన అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకున్నానని, ఇంకెప్పుడూ రాజీనామా చేయనని కేజ్రీవాల్ తెలిపారు. తన రాజీనామా వల్ల మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందారన్నారు. ఆందోళన ద్వారా రాజకీయాలు చెయ్యమని ఆయన తెలిపారు. ఢిల్లీని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తమ ఎన్నికల అజెండాగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా నరేంద్ర మోడీ గొప్ప ఆపరేటర్గా ఆయన అభివర్ణించారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడంలో నిర్లక్ష్యం ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు.