చైనా సోషల్ మీడియాను వదలని మోదీ
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో ముందడుగు వేశారు. చైనా సోషల్ మీడియాలోనూ ఖాతా తెరిచారు. చైనా ట్విటర్ గా పేర్కొనే 'వీబో'లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. 'వీబో'లో చేరినట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. చైనా భాషలో సందేశం పోస్ట్ చేశారు. 'హలో చైనా!.. వీబోతో చైనా స్నేహితులతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళతానని ట్విటర్ లో పేర్కొన్నారు.
చైనా పర్యటనకు కొద్ది వారాల ముందు ఆయన 'వీబో'లో ఖాతా తెరవడం విశేషం. మోదీ చైనా పర్యటనను విజయవంతం చేసేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని ఆసియా వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హాంగ్ జిలియన్ తెలిపారు. కాగా, కోటి 9 లక్షల 2 వేల 510 మంది ఫోలోవర్లతో ట్విటర్ లో మోదీ మూడో స్థానంలో ఉన్నారు.