కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖరారు!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమైంది. ఆదివారం(నవంబర్ 9న) మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. కనీసం ఆరుగురికి కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్లు దాదాపు ఖాయమయ్యాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, శివసేన పార్టీలకు విస్తరణలో ప్రాతినిథ్యం కల్పించనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీని కలవడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. రెండు రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని మోదీని కలిసిన తర్వాత చంద్రబాబు విలేకరులతో చెప్పారు. టీడీపీ నుంచి సుజనా చౌదరికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా కొత్త ముఖాలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించనున్నారని సమాచారం.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మొత్తం 22 మంది మంత్రులున్నారు. అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్- అదనంగా పలు శాఖలు నిర్వహిస్తున్నారు.