ఇంఫాల్‌లో మోదీ.. ఈశాన్యానికి హామీ!
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఆర్థిక నిర్బంధం ఎంతమాత్రం ఉండబోదని, ఈ విషయంలో తాను భరోసా అని హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బీజేపీకి చెందిన మాజీ ప్రధాని వాజపేయి ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. వాజపేయి కృషిని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకుపోలేదని, అందువల్లే ప్రస్తుత దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక చట్టాన్ని బీజేపీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే 15 నెలల్లో మార్పు తీసుకొచ్చి చూపిస్తామని హామీ ఇచ్చారు.
మణిపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో మార్చి 4న, 8న రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. గత 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్-బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.