అంగారకుడు, చంద్రుడిపైకి డ్రోన్లు!
చీకటి ప్రదేశాల గుట్టు తేల్చేందుకు నాసా కసరత్తు
వాషింగ్టన్: అంగారక గ్రహం, చంద్రుడు, కొన్ని గ్రహశకలాల పైకి డ్రోన్లను పంపేందుకు నాసా కసరత్తు చేస్తోంది. వాటిపై ఇప్పటిదాకా మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు ఈ కొత్త తరహా ఆలోచన చేస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటిదాకా ప్రయోగించిన రోవర్లు ఇక్కడ దిగలేదు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్లను వాటిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది.
‘‘అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం పనిచేసేలా డ్రోన్లను తయారు చేస్తున్నాం. అంగారకుడు, గ్రహశకలాలపై ఉన్న నీడ ప్రాంతాల వద్ద శోధించడం వీటి ముఖ్య ఉద్దేశం. లోతైన లోయలు, పెద్దపెద్ద రంధ్రాల వద్ద భౌగోళిక ప్రతికూలత కారణంగా సాధారణ రోవర్లు దిగలేవు. అందుకే బ్యాటరీల సాయంతో ఎగిరే డ్రోన్లను రూపొందిస్తున్నాం.
ఇవి అక్కడ మట్టిని తవ్వి నీరు, మంచు జాడలేమైనా ఉన్నాయో పరిశీలిస్తాయి’’ అని నాసాకు చెందిన కెనడీ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త రాబ్ ముల్లర్ తెలిపారు. ఒకేసారి ఎక్కువ డ్రోన్లు అక్కడ దిగుతాయి కాబట్టి ఒకటి విఫలమైనా, మిగతా డ్రోన్ల ద్వారా విలువైన సమాచారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.