'తెలంగాణకు పరిష్కారం లభించకపోతే.. ముందస్తు ఎన్నికలు'
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ రాజీనామాలు సమర్పించడం, విభజన అంశంపై తీర్మానం చేయని పక్షంలో లోకసభకు ముందస్తు ఎన్నికలు రావొచ్చని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ జోస్యం చెప్పారు.
‘తెలంగాణ’పై ఏర్పడిన ప్రతిష్టంభన త్వరగా తొలగని పక్షంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు తప్పకపోవచ్చని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) నేత, కేంద్రమంత్రి తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికలు దగ్గరికొస్తున్నాయనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపీలంతా రాజీనామా చేస్తే పరిస్థితి జటిలమవుతుంది’ అని మంగళవారం వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట ఏర్పాటు సమస్యకు ఆర్థిక ప్యాకేజ్ సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, సీమాంధ్ర.. ఈ రెండు ప్రాంతాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం ఆలోచించాలని సూచించారు. ‘మంత్రుల బృందం ఈ అంశాలన్నిటినీ చర్చిస్తుంది. ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా’నన్నారు.
ఆచరణసాధ్యమైన చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమన్నారు. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను విభజించినప్పుడు కూడా ఇరుప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యకూ అదే పద్ధతి అవలంబిస్తే బావుంటుందన్నారు.