యూనివర్సిటీలను గాడిలో పెట్టాల్సిందే: కేసీఆర్
ఇష్టారాజ్యంగా నడుస్తున్న యూనివర్సిటీల పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల స్థితిగతులను ఆయన సమీక్షించారు. అవసరమైతే యూనివర్సిటీల చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. అన్ని యూనివర్సిటీలకు ఒకే వ్యక్తి చాన్సలర్గా ఉండటం వల్ల పర్యవేక్షణ కష్టం అవుతుందని, యూనివర్సిటీల అవసరాలను బట్టి అనుభవం, నైపుణ్యం ఉన్నవారిని చాన్సలర్లుగా నియమిస్తామని ఆయన అన్నారు. చాన్సలర్లను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖను కూడా విద్యాశాఖ పరిధిలోకి తెస్తామని, వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. సనత్ నగర్ పరిధిలోని ఇందిరానగర్ బస్తీని సందర్శించారు. బస్తీలలోని ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, ఇరుకైన ఇళ్లలో కనీస వసతులు లేని బస్తీలలో సుమారు 2 లక్షల కుటుంబాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరానగర్ బస్తీ వాసుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకు ఎదురుగా ముస్లిల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపడతామని ఆయన అన్నారు.