నెహ్రూను అవమానించడానికే ఆ యుద్ధం!
వాషింగ్టన్: మూడో ప్రపంచదేశాల నాయకుడిగా భారత ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ ఎదుగుతుండటంతో ఆయనను అవమానించాలనే ఉద్దేశంతోనే అప్పటి చైనా పాలకుడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపకుడు మావో జెడాంగ్ 1962లో యుద్ధానికి దిగారు. ఆనాటి చైనా దురాక్రమణను తరిమికొట్టేందుకు నెహ్రూ అమెరికా సాయాన్ని కోరారు. చైనాను ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్ విమానాలు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ కూడా రాశారు. ఇలా ఆనాటి భారత్-చైనా యుద్ధానికి సంబంధించిన ఎన్నో అంశాలతో ఓ కొత్త పుస్తకం విడుదలైంది. 'జేఎఫ్కేస్ ఫార్గాటెన్ క్రైసిస్: టిబెట్, ద సీఐఏ అండ్ సినో-ఇండియన్ వార్' పేరిట సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ ఈ పుస్తకాన్ని రాశారు.
"మావో దృష్టి అంతా నెహ్రూపైనే. అయినా భారత్ను ఓడించడమంటే మావో శత్రువులైన నికిటా క్రృచ్చెవ్, కెన్నడీకి ఎదురుదెబ్బే' అని ఆయన ఈ పుస్తకంలో రాశారు. యుద్ధంలో భారత భూభాగం చైనా ఆధీనంలోకి వెళుతుండటం, పెద్దసంఖ్యలో తమ సైనికులు చనిపోతుండటంతో 1962 నవంబర్లో నెహ్రూ, కెన్నడీకి లేఖ రాశారు. చైనా దురాక్రమణను ఎదుర్కోవడానికి గగనతల రవాణా, ఫైటర్ జెట్ విమానాలు కావాలని కోరారు. మీరు, మన మిత్రులు ఇందుకు ఎంతో సహకరించాలని లేఖలో అభ్యర్థించారు.
"పీపుల్ లిబెరేషన్ ఆర్మీ'ని ఓడించడానికి చైనాకు వ్యతిరేకంగా గగనతల యుద్ధంలో పాల్గొనాల్సిందిగా నెహ్రూ కెన్నడీని కోరారు. ఇది చాలా పెద్ద అభ్యర్థన. అప్పటికి దశాబ్దం కిందటే కొరియా విషయమై అమెరికా బలగాలు, చైనా బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా కొత్త యుద్ధం చేయాల్సిందిగా భారత్ కెన్నడీని కోరింది' అని ఆయన పుస్తకంలో తెలిపారు. అమెరికా వాయుసేనకు చెందిన 12 స్కాడ్రన్లను తమకు పంపాల్సిందిగా అడిగిందని ఆయన పేర్కొన్నారు.