వ్యాధి చికిత్స కోసం అడిగినంత ఫీజు చెల్లించలేదనే కారణంతో తన వ్యాధి నయం కాకుండా చేశారని ఓ రిటైర్డు పోలీసు అధికారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్(హైదరాబాద్): వ్యాధి చికిత్స కోసం అడిగినంత ఫీజు చెల్లించలేదనే కారణంతో తన వ్యాధి నయం కాకుండా చేశారని ఓ రిటైర్డు పోలీసు అధికారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ తేజస్వినగర్ కాలనీ నివాసి, చిక్కడపల్లి ట్రాఫిక్ రిటైర్డ్ ఎస్సై వి.రమేష్(58) జనవరి 7వ తేదీన రెండు కాళ్లలో వెరికోస్ వీన్స్(నరాల సంబంధిత వ్యాధి)తో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. మరుసటి రోజు ఆ ఆస్పత్రి వైద్యుడు చంద్రశేఖర్ ఆయన గదికి వచ్చి ఆ వ్యాధికి ఆర్‌ఎఫ్‌ఏ థెరపీ చేయాల్సి ఉంటుందని, రూ.10 వేలు ఫీజు అని చెప్పాడు.
అయితే తన వద్ద రూ.5వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో పాటు ఆ డబ్బు ఇచ్చారు. అయితే అడిగినంత మొత్తం ఇవ్వనందుకు తన కాళ్లలోని రెండు నరాలను ఉద్దేశపూర్వకంగా తొలగించాడని బాధితుడు ఆరోపించారు. ఇటీవల తన వ్యాధి నయం కాకపోకవటంతో మరో వైద్యుడిని సంప్రదించగా కాలిలో రెండు నరాలు తొలగించినట్లు తెలిసిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను మోసం చేయడంతో పాటు నిర్లక్ష్యంతో చికిత్స చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు సదరు వైద్యునిపై ఐపీసీ సెక్షన్ 420,336ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.