భారత్కు ట్రంప్ మరో షాక్!
భారత్కు ట్రంప్ మరో షాక్!
Published Wed, Feb 8 2017 7:26 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా వేతన చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ దేశీయ ఐటీ కంపెనీలకు షాకిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరో ఝలకిచ్చారు. అమెరికాకు వచ్చే లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను సగానికి తగ్గించే బిల్లును ఇద్దరు టాప్ యూఎస్ సెనేటర్లు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో దశాబ్దం లోపల అమెరికాకు వచ్చే ఇమ్మిగ్రెంట్లలో కోత పెట్టనున్నారు. సెనేటర్లు ప్రతిపాదించిన ఈ చట్టం అమెరికాలో గ్రీన్ కార్డు లేదా శాశ్వత నివాసాన్ని పొందాలనుకునే వారికి ప్రతికూలంగా మారనుంది. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలని చాలామంది భారతీయులు ఆశిస్తుంటారు. వారిపై కూడా ఇది ఎఫెక్ట్ చూపనుంది.
''ది రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ లేదా రైజ్ '' అనే యాక్ట్ను రిపబ్లికన్ సెనేటర్ టాక్ కాటన్, డెమొక్రాటిక్ పార్టీకి చెందిన డేవిడ్ పర్డ్యూలు ప్రతిపాదించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్లో మార్పులను తీసుకొస్తామని, నైపుణ్యంతో కూడిన వీసా లేని విదేశీయులను అమెరికాలో తగ్గిస్తామని పేర్కొన్నారు. ఇక ఇప్పటినుంచి ప్రతేడాది జారీచేసే గ్రీన్ కార్డు, న్యాయబద్ధమైన శాశ్వత నివాసాన్ని తగ్గించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
దీంతో గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వేలకొద్దీ భారతీయులపై అతిపెద్ద ప్రభావమే చూపనుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు మద్దతుగా ఈ బిల్లును సెనేటర్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం భారతీయులు గ్రీన్ కార్డు పొందాలంటే 10 ఏళ్ల నుంచి 35 ఏళ్లు వేచిచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక చట్టంగా మారితే, మరింత కాలం గ్రీన్ కార్డు కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Advertisement