10,565 కోట్లు | new promises of Telangana government will cost over RS. ten crore | Sakshi
Sakshi News home page

10,565 కోట్లు

Published Wed, Mar 1 2017 2:14 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

10,565 కోట్లు - Sakshi

10,565 కోట్లు

- పదివేల కోట్లు దాటిన కొత్త హామీల పద్దు
- కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.1,032 కోట్లు
- సబ్సిడీపై గొర్రెల పెంపకానికి రూ. 5 వేల కోట్లు
- వీఆర్‌ఏ, అంగన్‌వాడీల జీతాల భారం 313 కోట్లు
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహకాలకు రూ. 300 కోట్లు
- గృహ రుణాల బకాయిలకు రూ. 3,920 కోట్లు
- బడ్జెట్‌ లెక్కలేసుకుంటున్న ఆర్థిక శాఖ


సాక్షి, హైదరాబాద్‌

బడ్జెట్‌ ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్‌ఏల వేతనాలను భారీగా పెంచింది. వివిధ వర్గాలకు భారీ ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలను ప్రకటించింది. రెండు లక్షల గొర్రెల యూనిట్లు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకం, నవజాత శిశువులకు కేసీఆర్‌ కిట్లు, అంగన్‌వాడీలకు సన్నబియ్యం వంటి కార్యక్రమాలు ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జనహిత వేదికగా వరుసగా వివిధ వర్గాలతో సమావేశమైన సీఎం కొత్త హామీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకంలో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల బ్యాంకు బకాయిలను కూడా రద్దు చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన వరాల ఖరీదెంత? ప్రభుత్వ ఖజానాపై ఆర్థికంగా ఎంత అదనపు భారం పడుతుంది? ఆర్థిక శాఖ ఈ మేరకు లెక్కలేసుకుంటోంది. ఇప్పటికే వచ్చిన అంచనా ప్రకారం ఈ వరాల పద్దు రూ.10,565 కోట్లకు చేరుతోంది.

కొత్త కలెక్టరేట్ల డిజైన్లకు ఓకే
కొత్త సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు రూ.1,032 కోట్లు వెచ్చించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. మంగళవారం ఈ ఫైలుపై సంతకం చేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కొత్త జిల్లాలతో పాటు పలు పాత భవనాలున్న జిల్లా కేంద్రాల్లోనూ కొత్త కలెక్టరేట్లు నిర్మించనున్నారు. సంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తారు. కలెక్టరేట్ల నిర్మాణ కన్సల్టెంట్‌గా ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డి డిజైన్‌ చేసిన నమూనాలను ముఖ్యమంత్రి ఆమోదించారు. ప్రాజెక్టు వ్యయంలో మూడు శాతం ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డికి కన్సల్టెంట్‌ ఫీజుగా ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ఫీజును మరొక శాతం పెంచాలని ఆర్కిటెక్ట్‌ చేసిన విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ఫైలును సైతం ఆమోదించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించనున్నారు.

వీఆర్‌ఏలు, అంగన్‌వాడీల జీతాల భారం ఇదీ..
వీఆర్‌ఏలు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.313 కోట్ల భారం పడనుంది. తాజాగా వీఆర్‌ఏల వేతనాన్ని భారీగా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.4,700 చొప్పున రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్‌ఏలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.109 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో ఉన్న 35,700 మంది అంగన్‌వాడీ టీచర్లకు జీతాలను పెంచారు. ఒక్కొక్కరికి రూ.3,500 చొప్పున జీతం పెంచటంతో.. ఏడాదికి రూ.150 కోట్ల భారం పడనుంది. అలాగే అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.1500 చొప్పున జీతం పెరగనుంది. దీంతో జీతాల పద్దు రూ.54 కోట్ల మేర పెరగనుంది.

కాన్పులకు ప్రోత్సాహకం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కొత్త కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో 31 శాతం కాన్పులు.. అంటే ఇంచుమించుగా 2 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల సాయం, పుట్టిన పిల్లలకు అవసరమైన బేబీ సోప్స్, షాంపూలు, మందులుండే రూ.2 వేల విలువైన కిట్‌ను అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆడపిల్ల పుడితే మరో రూ.1,000 అదనంగా సాయం అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6,000 ప్రోత్సాహకంగా అందించనుంది. దీనికి రెండితల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటంతో దీనికి దాదాపు రూ.300 కోట్లు అవసరమవుతాయని ఆర్థిఖ శాఖ లెక్కలేసింది.

ప్రభుత్వ పక్కా ఇళ్ల రుణాల మాఫీ
ప్రభుత్వ పక్కా ఇళ్లు పొందిన లబ్ధిదారుల గృహ రుణ బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించారు. 1983 నుంచి 2014 వరకు ఉన్న రూ.3,920 కోట్ల రుణభారాన్ని తొలగించాలని నిర్ణయించారు. రుణాల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలను నెల రోజుల్లోనే తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త బడ్జెట్‌లో గృహ రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం
రేషన్‌ షాపులు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బియ్యం సబ్సిడీకి ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు వెచ్చిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్రం 3,200 టన్నుల బియ్యం కేటాయిస్తోంది. కిలో రూ.30.50 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ మినహాయిస్తే మిగిలిన రేటును రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. దీంతో బియ్యం సబ్సిడీ భారం మరో రూ.100 కోట్లు పెరుగుతుందని అంచనా.

గొర్రెల పెంపకానికి పెద్ద వాటా
గొర్రెల పెంపకానికి రాబోయే రెండేళ్లలో రూ.5 వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 శాతం సబ్సిడీతో 2 లక్షల యూనిట్ల పంపిణీని లక్ష్యంగా ఎంచుకుంది. 21 గొర్రెలుండే ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షల అంచనా ఖర్చుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో కొత్త వరాల్లో ఇదే పెద్ద వాటాను ఆక్రమించనుంది. అలాగే నిరుటి తరహాలోనే చేపల పెంపకానికి నిధులు ఖర్చు చేయనుంది. వీటితోపాటు ఎంబీసీ వర్గాల చేయూతకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement