నటి ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ జియా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే డిఫెన్స్ వాదనను అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులు తప్పుపట్టారు. జియాది ఆత్మహత్యకాదు.. హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం ముంబై హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తికావచ్చిన కేసుపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది.
ఫోరెన్సిక్ రిపోర్టులో ఏముందంటే..
జియా ఖాన్ కింది పెదవిపై బలమైన గాయం ఉంది. ఉరివేసుకున్నాక ఊపిరి ఆడని స్థితిలో ఆమే తన పెదవిని కొరుక్కొని ఉంటుందని ముంబై పోలీసులు కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ నిజానికి ఆ గాయం బలమైన వస్తువు లేదా బలంగా ఒత్తడం వల్లే అయిందని పేన్ జేబ్స్ అంటోంది. అంతేకాదు.. జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద కనిపించిన మచ్చలు.. చున్నీ ఒత్తిడ వల్ల ఏర్పడినవి కావని పేర్కొంది.
అసలేం జరిగింది?
అరంగేట్రంలోనే 'నిషబ్ద్'లో అమితాబ్ బచ్చన్తో కలిసి రొమాన్స్ పండించి, అనతికాలంలోనే క్రేజీ స్టార్ గా ఎదిగిన జియా ఖాన్.. 2013, జూన్ లో ముంబై జుహులోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారు.ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలీవుడ్ వెటరన్ నటుడు ఆదిత్యా పాంచోలి తనయుడు సూరజ్ పాంచోలి- జియాల మధ్య పీకల్లోతు ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ గొడవ పడిన సందర్భంలో సూరజ్.. జియాను చంపేశాడనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాంబే హైకోర్టు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఒక దశలో సూరజ్ పాంచోలీని అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం బెయిల్ పై ఉంటోన్న సూరజ్ పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇంకా విచారణ పూర్తికాని ఈ కేసులో జియా తల్లి బుధవారం దాఖలుచేయనున్న తాజా పిటిషన్ ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.