ముఠా హైదరాబాద్‌లో.. లూటీ అమెరికాలో!
* కాల్ సెంటర్ ద్వారా విదేశీయులకు కుచ్చుటోపీ
* అమెరికా, బ్రిటన్ ముఠా ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరణ
* బ్యాంకు రుణం మంజూరు చేస్తామని ఇక్కడ్నుంచి ఫోన్లు
* మొదటి వాయిదా ముందే చెల్లించాలంటూ ముగ్గులోకి
* సొమ్ము చేతికందగానే ‘హవాలా’ ద్వారా లావాదేవీలు
* సూత్రధారి గుజరాత్‌వాసి.. పాత్రధారులు నగర యువకులు
* 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: లాటరీలు, బహుమతుల పేరుతో మోసాలు చూశాం.. ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్స్‌తో అందినకాడికి దండుకునే నైజీరియన్ ముఠాల చీటింగ్‌లూ చూశాం..! ఇప్పుడు ఈ గ్యాంగ్‌లే డంగైపోయే ఘరానా కాల్ సెంటర్ క్రైమ్ హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అమెరికా, బ్రిటన్‌లోని లండన్‌లో బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనవారే లక్ష్యంగా ఈ భారీ మోసానికి తెరదీశారు. రుణం దక్కని వారి వివరాలు సేకరించి ఇక్కడ్నుంచి కథ నడిపించారు.
అచ్చంగా అమెరికన్ల తరహాలో ఫోన్లలో మాట్లాడుతూ బురిడీ కొట్టించారు. ‘మీ లోన్ ఓకే అయింది.. అయితే మొదటి వాయిదా ముందే చెల్లించాలి..’ అని అడగడం.. ఆ వాయిదా సొమ్ము చేతికందగానే వాటాలు పంచుకొని మరో కస్టమర్‌ను వెతుక్కోవడం.. ఇదీ ఈ గ్యాంగ్ చేస్తున్న మోసం! అమెరికా, లండన్‌కు చెందిన వారిని ఇలా సుమారు రూ.1.5 కోట్లకుపైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన 14 మంది నిందితులను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కేసు వివరాలను తెలిపారు.
గుజరాత్ టు హైదరాబాద్ వయా పుణె
గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఇషాన్ పాఠక్ ఈ మోసానికి సూత్రధారి. మహారాష్ట్రలోని పుణే వాసి రాహుల్ బజాజ్ ద్వారా కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన ఖాదర్‌ను పరిచయం చేసుకున్నాడు. వీరంతా కలిసి అప్పట్లో కొన్ని ఆన్‌లైన్ నేరాలు చేశారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులను వినియోగించుకున్నారు. ఆ నేరాలు వెలుగులోకి రావడంతో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన ఖాదర్ ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో ఖాదర్ దగ్గర సహాయకులుగా పని చేసిన నగర యువకులు ఎంఏ ఖరీద్, నోమన్, సయ్యద్ అబ్దుల్లా, మహ్మద్ అబ్దుల్‌లతో ఇషాన్ పరిచయాలు కొనసాగించాడు. వారి ద్వారా కాల్ సెంటర్ చీటింగ్‌కు తెరదీశాడు.
బురిడీ కొట్టించారిలా..
ఇషాన్‌కు అమెరికా, లండన్‌లో అనుచరులు ఉండటంతో వారి సాయంతో అక్కడి బ్యాంకులకు సంబంధించిన డేటాను హ్యాకింగ్ ద్వారా సేకరించేవాడు. ‘లీడ్స్’గా పిలిచే ఈ వివరాలను అక్కడి ఏజెంట్ల ద్వారా బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేయించి ఈ-మెయిల్ రూపంలో తెప్పించుకునేవాడు. 1,000 నుంచి 5 వేల డాలర్ల మధ్యలో రుణానికి దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించేవాడు. ఈ లీడ్స్‌లో దరఖాస్తుదారుడి పేరు, చిరునామా, సోషల్ సెక్యూరిటీ నంబర్ సహా మొత్తం 40 రకాలైన సమాచారం ఉంటుంది. దీన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న నలుగురు ఏజెంట్లకూ పంపేవాడు. వారికి కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయించాడు.
రెయిన్‌బజార్‌లో పర్వేజ్ కాలింగ్ సొల్యూషన్స్, టోలీచౌకిలో క్విక్ క్యాష్ లోన్స్, క్యాష్ సేమ్ డే, పంజగుట్టలో ఏబీ కాలింగ్ సొల్యూషన్స్ పేరిట వీటిని ఏర్పాటు చేశాడు. వీటిలో కొందరు ఉద్యోగుల్ని సైతం నియమించుకున్నారు. వారికి అమెరికా, లండన్ వాసులతో ఎలా మాట్లాడాలనే అంశంపై 15 రోజులపాటు శిక్షణ ఇచ్చేవాడు. గ్యాంగ్ సభ్యులందరికీ ఆయా దేశాల్లోని పేర్లను మారుపేర్లుగా పెట్టారు. ఆయా దేశాల్లో బ్యాంకులు పనిచేసే సమయాల్లోనే ‘కస్టమర్ల’కు కాల్స్ చేసే వారు. హైదరాబాద్‌కు చెందిన నంబర్ల నుంచి కాల్ చేస్తే అనుమానించే అవకాశం ఉండడంతో.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఐబీమ్, ఎక్స్-లైట్, సాఫ్ట్‌ఫోన్ అనే సాఫ్ట్‌వేర్లను వినియోగించారు. వీటి ద్వారా కాల్ చేస్తే దాన్ని రీసీవ్ చేసుకునే వ్యక్తి ఏ దేశానికి చెందిన వాడైతే అక్కడి లోకల్ నంబర్ అతడికి డిస్‌ప్లే అయ్యేలా చేయవచ్చు.
వెయ్యి డాలర్లకు 110 డాలర్ల వాయిదా
ముఠా సభ్యులు ఆంగ్ల పేర్లతో అక్కడి కస్టమర్లను పరిచయం చేసుకునేవారు. ‘లీడ్స్’లో ఉన్న వివరాలను చెప్పేవారు. దీంతో తాము దరఖాస్తు చేసిన బ్యాంకు నుంచే ఫోన్ వచ్చినట్లు అవతలి వారు భ్రమపడే వారు. బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని రుణం మంజూరైందని, నెలసరి వాయిదా ఎంతో చెప్పి, చెల్లించగలరా అని అడిగేవాడు. వారు అంగీకరించగానే.. కస్టమర్ కాల్‌ను అధికారికి కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి మరో ముఠా సభ్యుడికి ఇచ్చేవాడు. ‘మీకు ముందు రుణం మంజూరు చేసేస్తాం. రెండ్రోజుల్లో సంతకాలు తీసుకుంటాం. అయితే మీ చెల్లింపు సామర్థ్యం తెలుసుకోవాలి. ఇందుకు మొదటి విడత వాయిదా ముందే చెల్లించండి’ అంటూ ముగ్గులోకి దింపేవాడు. వెయ్యి డాలర్ల రుణానికి నెలకు 110 డాలర్ల చొప్పున ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాలని కోరేవాడు. వాయిదాను ఈజీ క్యాష్ రూపంలోనే చెల్లించాలని చెప్పేవారు.
ఈజీ క్యాష్ ద్వారా లావాదేవీలు
అమెరికా, బ్రిటన్‌లో యూ-క్యాష్, గ్రీన్‌డాట్ కార్డ్ వంటి ఈజీ క్యాష్ లావాదేవీలు నడుస్తాయి. వీటికి సంబంధించిన ఔట్‌లెట్స్‌లో వినియోగదారులు నగదు చెల్లిస్తారు. కొంత కమీషన్ తీసుకుని నిర్వాహకులు 14 నుంచి 16 సంఖ్యలతో ఉండే కార్డు నంబర్, సీవీవీ నంబర్ ఇస్తారు. వీటిని ఆ కస్టమర్లు ముఠా సభ్యులతో ఫోన్‌లో చెప్పేవారు. ఈ వివరాలన్నీ ఇషాన్‌కు చేరేవి. అతడు వీటిని అమెరికాలో ఉండే ఏజెంట్లకు పంపి తక్షణం నగదు డ్రా చేయించేవాడు. వాళ్లు కమీషన్ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని హవాలా రూపంలో ఇషాన్‌కు చేరవేసేవారు. అతడు హైదరాబాద్‌లోని ఏజెంట్లకు 40 శాతం కమీషన్‌ను హవాలా ద్వారానే పంపేవాడు. నగదు పంపిన కస్టమర్ నంబర్‌ను బ్లాక్ చేసి సంప్రదింపులు నిలిపివేసేవారు. బాధితులంతా అక్కడివారు కావడంతో ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు ఉండేవి కాదు.
డొంక కదిలిందిలా..: బుధవారం పాతబస్తీ లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా చిక్కా రు. పేర్లు చెప్పమని అడగ్గా.. వారు బిన్ హాప్కి న్స్, జాసన్ స్మిత్‌గా చెప్పారు. అయితే స్థానికులుగా ఉన్న వీరు విదేశీయుల పేర్లు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించ గా.. మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు 4 కాల్ సెంటర్లపై దాడులు చేసి 14 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ సహా నిందితుల్ని పట్టుకోవడానికి కేసును సీసీఎస్‌కు అప్పగించనున్నారు.
పోలీసులకు చిక్కిన నిందితులు, వారి మారు పేర్లు
1. మహ్మద్ అబ్దుల్ పర్వేజ్-జాసన్ స్మిత్
2. బాసిత్ అలీ అలియాస్ అర్షద్-బిన్ హాప్కిన్స్
3. సయ్యద్ అఫ్సాన్ ఉల్ ఇస్లాముద్దీన్ అలియాస్ నౌమన్-కీత్ బ్రౌన్
4. సయ్యద్ ముదసర్ మోయినుద్దీన్ అలియాస్ నౌషాద్-డేవిడ్ హోమ్స్
5. ఎంకే ఖదీర్-రోగర్ బ్యాంక్స్
6. వాసిర్ ఆసిఫ్-సామ్ విల్సన్
7. వసీమ్ అహ్మద్-జాక్ స్మిత్
8. సౌద్ అహ్మద్-అస్టిన్ మార్క్
9. మహ్మద్ ఖయూమ్-కెవిన్ కూపర్
10. షేక్ జునైద్-జేమ్స్ స్మిత్
11. సయ్యద్ అబ్దుల్లా-స్టౌర్ట్ బ్రౌన్, ఫ్రాంక్ జోర్డాన్
12. మహ్మద్ ఇంతియాజ్-స్టీవ్ జోనిస్
13. సయ్యద్ సల్మాన్-డేవిడ్ వైట్
14. రవితేజ-బీన్ హాకిన్స్