రెచ్చిపోయిన ఉగ్రవాదులు: 14 మంది మృతి
కాబూల్: అఫ్ఘానిస్థాన్లోని ఓ హోటల్లో సాయుధులు తెగబడ్డారు. కాబూల్లోని విదేశీయుల అతిథి గృహంలోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు భారతీయులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతీయ మృతులు ఇద్దరిలో ఒకరు తెలుగువారు కూడా ఉన్నట్లు అనధికారికంగా సమాచారం వచ్చింది. దీన్ని ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. పార్క్ ప్యాలెస్ హోటల్ అనే భవనాన్ని వారు లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులను కూడా పోలీసులు హతమార్చారు. కాబూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ తాలిబన్లు స్థావరాలు ఏర్పాటు చేసుకునే ఉన్నారు. దీంతో కాబూల్ లక్ష్యంగా ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువయ్యాయి. అందులోనూ విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
ఈ హోటల్లో సాయుధుల చెరలో చాలామంది ఉన్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులు, ఇతర దేశీయులే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అందరి క్షేమం ఆకాంక్షించారు. వారికి ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.