
'విద్రోహులకు నిర్భయ తీర్పు ఓ మరణశాసనం'
విద్రోహులకు నిర్భయ కేసు తీర్పు ఓ మరణశాసనమని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. నిర్భయ సామూహిక అత్యాచార కేసులో నిందితులకు శుక్రవారం న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ సందర్భంగా హోం మంత్రి షిండేపై నిర్భయ కేసులో న్యాయస్థానం విధించిన తీర్పు పైవిధంగా స్పందించారు. క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి ఆ శిక్ష ఓ హెచ్చరికా లాంటిందని ఆయన తెలిపారు.
నిర్భయ కేసులో న్యాయం జరిగిందన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు. నిర్భయ కేసులో నిందితులు అమానవీయమైన చర్యలకు పాల్పడ్డారన్నారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ అధికారి ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు షిండే వివరించారు. మహిళలపై అత్యాచార కేసులు తమ శాఖ వద్ద ఏవి పెండింగ్లో లేవని హోం శాఖ మంత్రి షిండే తెలిపారు.