మా రాష్ట్రానికి నువ్వు అయ్యవా? ఓనర్‌వా?
పట్నా: కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాకిస్థాన్‌కు ఇచ్చేస్తామంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ బంఫర్ ఆఫర్ ఇచ్చేశారు. కశ్మీర్ కావాలంటే బిహార్‌తో కలిపి ఒక ప్యాకేజీలాగా ఇస్తామని, బిహార్ వద్దనుకుంటే రెండింటినీ ఇవ్వబోమని ఆయన ఫేస్‌బుక్‌లో కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కానీ, కట్టూ వ్యాఖ్యలు బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు కోపం తెప్పించాయి. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించడమేనని నితీశ్ పేర్కొన్నారు. ’బిహార్‌కు ఆయన తల్లీతండ్రా? లేక యజమానా’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కట్జూ పేరును నితీశ్ ప్రస్తావించనప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాక్‌కు ఇచ్చేస్తామంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై బిహార్ రాజకీయ నాయకులు భగ్గుమంటున్నారు. అధికార జేడీయూతోపాటు ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కట్జూపై దేశద్రోహం కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేశారు.
నిజానికి నితీశ్‌కు జస్టిస్ కట్జూకు మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. గతంలో కట్జూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బాహాటంగానే నితీశ్ సర్కారును దుయ్యబట్టారు. బిహార్‌లో ప్రతికా స్వేచ్ఛ ఏమాత్రం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా జస్టిస్ కట్జూ తప్పుబట్టారు.