‘ప్రత్యేక హోదా’ సమరం
బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో కదం తొక్కిన పార్టీలు
పాట్నాలో సీఎం నితీశ్ కుమార్ సత్యాగ్రహం
జార్ఖండ్‌లో మూడు పార్టీల ఆధ్వర్యంలో బంద్
భువనేశ్వర్‌లో రాజ్‌భవన్ వద్ద బీజేడీ నిరసన
పాట్నా/రాంచీ/భువనేశ్వర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం సీమాంధ్రకు కల్పించిన ప్రత్యేక హోదాను తమ రాష్ట్రాలకూ ఇవ్వాలని ఆదివారం బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లోని ప్రధాన పార్టీలు కదం తొక్కాయి. ధర్నాలు, ఆందోళనలనతో హోరెత్తించాయి. కేంద్రం తమ డిమాండ్‌ను పెడచెవిన పెడుతోందని నిప్పులు చెరిగాయి.
బీహార్‌లో.. : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలో ఐదున్నర గంటలపాటు ధర్నా చేశారు. అధికార జేడీయూ పిలుపునిచ్చిన బీహార్ బంద్‌లో భాగంగా గాంధీ మైదాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆయన సత్యాగ్రహం చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేడీయూ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘కేంద్రం బీహార్‌పై వివక్ష చూపుతోంది. ప్రత్యేక హోదా ఆత్మగౌరవం, ప్రతిష్టకు సంబంధించిన విషయం. దీని కోసం ప్రజలు చివరివరకు ఐక్యంగా పోరాడాలి’ అని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధనకు ప్రజల మద్దతు కూడట్టేందుకు ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. అంతకుముందు ఆయన మంత్రులు, పార్టీ నేతలతో ఇంటి నుంచి 5కి.మీ నడిచి ధర్నాస్థలి చేరుకున్నారు. జేడీయూ బంద్‌తో రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. పార్టీ కార్యకర్తలు పాట్నా సహా పలు చోట్ల రహదారులను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు రైళ్లకు అంతరాయం కలిగింది.
జార్ఖండ్‌లో..: జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్), ఏజేఎస్‌యూ పార్టీ, జేడీయూ ఆధ్వరంలో బంద్ జరిగింది. మొత్తం 24 జిల్లాలకుగాను బొకారో, రాంచీ, ధన్‌బాద్ సహా పది జిల్లాల్లో సంపూర్ణంగా జరగగా, మిగతా జిల్లాల్లో మిశ్రమ స్పందన లభించింది. నిరసనకారులు అడ్డుకోవడంతో పలుచోట్ల బస్సులు, రైళ్ల రాకపోకలకు ఆటంకమేర్పడింది.
ఒడిశాలో..: ఒడిశాకు కేంద్రం ప్రత్యేక హోదా నిరాకరిస్తోందని ఆరోపిస్తూ పాలక బీజేడీ కార్యకర్తలు రాష్ట్రవాప్తంగా ఆందోళనకు దిగారు. యువకార్యకర్తలు, కొంతమంది ఎమ్మెల్యేలు భువనేశ్వర్‌లోని రాజభవన్ వద్ద నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని బ్లాకే డే పాటించారు. గంజాం జిల్లా ఛత్రపూర్‌తోపాటు, మరో చోట జరిగిన కార్యక్రమాల్లో సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రపతిని కలిసిన గూర్ఖాలాండ్ బృందం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ప్రతినిధి బృందం ఆదివారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ప్రతినిధి బృందానికి జీజేఎం నేత రోషన్ గిరి నేతృత్వం వహించారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుకు గల అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడి జీజేఎం వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకెళ్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సీమాంధ్రకు ఇచ్చి మాకు ఇవ్వరా?: నితీశ్, నవీన్
‘బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న న్యాయమైన డిమాండ్‌ను పట్టించుకోని కేంద్రం సీమాంధ్రకు మాత్రం ఆ హోదా కట్టబెట్టింది. కాంగ్రెస్ మా డిమాండ్‌ను అటకెక్కించింది. బీహారీల అభివృద్ధి ప్రత్యేక ప్రతిపత్తి వంటి వాటితోనే సాధ్యం’ అని నితీశ్ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోటి మంది సంతకాలతో తమ పార్టీ మెమొరాండం ఇచ్చినా, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తమ డిమాండ్‌లో బలముందని తెలిసి కేంద్రం రఘురామ్ రాజన్ కమిటీని వేసిందని, బీహార్ అత్యంత వెనుకబడి రాష్ట్రాల్లో ఒకటని ఆ కమిటీ చెప్పిందని వెల్లడించారు. బీజేపీని విమర్శిస్తూ.. ఆ పార్టీ మద్దతు లేకుంటే సీమాంధ్రకు ప్రత్యేక హోదా వచ్చేది కాదని, ఆ పార్టీ బీహార్‌కూ ఈ హోదా కోరి ఉండాల్సిందని అన్నారు. ఓట్ల కోసమే బీజేపీకి బీహార్ గుర్తొస్తుందని దుయ్యబట్టారు. కొత్తగా ఏర్పడే సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం దీని కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న తమ రాష్ట్రానికి ఎందుకివ్వలేదని ఒడిశా సీఎం నవీన్ ప్రశ్నించారు. ఈ హోదాకు అవసరమైన అన్ని అర్హతలూ ఒడిశాకు ఉన్నాయన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ను విభజించినందుకే సీమాంధ్రకు ఆ హోదా ఇచ్చారని, బీజేడీ ఒడిశాకు కూడా ఆ హోదా కావాలనుకుంటే రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ నేతలు అన్నారు.