
వైఎస్ జగన్ వాదనలో బలముంది: బీహార్ ముఖ్యమంత్రి
రాష్ట్రాల విభజనకు ఆర్టికల్ 3 ని సవరించాలంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలో బలం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు
పాట్నా:రాష్ట్రాల విభజనకు ఆర్టికల్ 3 ని సవరించాలంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలో బలం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు. రాష్ట్రాల విభజన విషయంలో ప్రస్తుతం ఉన్న పద్దతిని మార్చాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శాసన సభను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. విభజన విధానాన్ని మార్చాలంటూ కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపారు.
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి, తమ పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. గతంలో బీహార్ను కూడా విభజించే సమయంలో పాత పద్దతినే అనుసరించారన్నారు. రాష్ట్రాలను విభజించేటప్పుడు శాసన సభ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని నితీష్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో సాధారణ మెజారిటీ ఉన్న పార్టీలు విభజనలకు పాల్పడటం తగదని ఆయన తెలిపారు.