డ్రైవర్ లేకుండా నడిచిన రాజధాని ఎక్స్ ప్రెస్!
Published Tue, Jun 28 2016 2:07 PM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM
మజ్ గావ్-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. ఇంజన్ లో ఏదో లోపం తలెత్తడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర లోకో పైలట్ ఆపరేట్ చేయకుండా నడిచినట్లు సమాచారం. రత్నగిరి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని ఓ సొరంగంలో సాయంత్రం 5.50 నిమిషాల సమయంలో ప్రయాణిస్తున్న రైలు ఇంజిన్ లో లోపం తలెత్తింది. దీంతో లోకో పైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశాడు.
రైల్వే టెక్నీషియన్లు లోపాన్ని సరిచేస్తున్న సమయంలో లోకో పైలట్ గార్డు క్యాబిన్ లోకి వెళ్లాడు. లోపాన్ని సరిదిద్దడం పూర్తికాక ముందే రైలు ఇంజిన్ ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించింది. సొరంగం తర్వాత అంతా దిగువ భాగం కావడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర అలానే ప్రయాణించింది. దీంతో ఉలిక్కిపడిన లోకో పైలట్ ఎగువ భాగంలో రైలు నిదానంగా వెళ్తుడటంతో ఒక్కసారిగా గార్డు క్యాబిన్ నుంచి ఇంజన్ లోకి దూకి రైలును తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు.
ఇంజిన్ బ్రేక్స్ పాడవటం, పట్టాలు దిగువకు ఉండటంతో రైలు ముందుకు కదిలినట్లు చెబుతున్నారు. కాగా, రైలు స్లో అయిన తర్వాత పైలట్ రైలును నిలిపివేసి మరో ఇంజిన్ ను తెప్పించి పక్కనే ఉన్న చిప్లన్ స్టేషన్ లో రైలును ఆపినట్లు వివరించారు. దీనిపై స్పందించిన కొంకణ్ రైల్వే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా రైలు ఇంజిన్ లోకో పైలట్ లేకుండా ముందుకు వెళ్లిందనే వార్తలను కొట్టిపారేశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
Advertisement
Advertisement