భారతీయ జనతాపార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని వచ్చే ఎన్నికల్లో భారత ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన వీసా జారీ ప్రక్రియ విధానంలో గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అమెరికా శనివారం స్పష్టం చేసింది. అయితే మరో సారి మోడీ యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం సమీక్షిస్తామని తెలిపింది. అది కూడా యూఎస్ చట్టాలకు లోబడే నిర్ణయం తీసుకుంటామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మారీ హర్ఫ్ వెల్లడించింది.
శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వీసా జారీ ప్రక్రియలో ఎంతోకాలంగా అనుసరిస్తున్న విధాన్నానే ఇప్పుడు కూడా పాటిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం భారత రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. భారత్ లేదా ఇతరదేశాల్లోని రాజకీయ వ్యవహారాల్లో యూఎస్ ఎప్పుడు తలదూర్చదని మారీ హర్ఫ్ మరో సారి స్ఫష్టం చేశారు.
గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయంలోనే గోద్రాలో అల్లర్లు జరిగాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని మోడీకి వీసా జారీ చేసేందుకు యూఎస్ నిరాకరించింది. అదికాక నిన్న న్యూఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నరేంద్రమోడీని దేశ ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ ఎంపిక చేసింది. అందులోభాగంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు మారీ హర్ఫ్ పై విధంగా సమాధానం ఇచ్చారు.