ఓటుకు నోటు వ్యవహారంపై నో కామెంట్ : నరసింహన్
న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిరాకరించారు. మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఎయిర్పోర్ట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు కుదిపేస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించాలని విలేకర్లు గవర్నర్ను కోరారు.
అందుకు నో కామెంట్ అంటూ సున్నితంగా తిరస్కరించారు. న్యూడిల్లీ పర్యటన అందుకేనా అని ప్రశ్నించగా... రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తి అయింది.. ఇరు రాష్ట్రాల వివరాలు వివరించేందుకే ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. డిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో భేటీ కానున్నట్లు నరసింహన్ వివరించారు. వీందరతో తన భేటీ మర్యాద పూర్వకమేనని నరసింహన్ వివరించారు.