లండన్లో సుష్మాను కలసిన లలిత్ మోదీ
న్యూఢిల్లీ : ఐపీఎల్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆ సంస్థ చైర్మన్ లలిత్ మోదీ... భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్తో గతేడాది అక్టోబర్లో లండన్లో కలిశారు. అయితే.. అది కెన్సింగ్టన్ హోటల్ అధినేత జోగీందర్ సంగర్ ఇచ్చిన ప్రైవేటు డిన్నర్లో మాత్రమేనట. ప్రవాస భారతీయ దివస్ కోసం లండన్ వెళ్లిన సుష్మా, ఆ హోటల్లోనే బస చేశారు. ఆ సందర్భంగానే సంగర్ ఆమె గౌరవార్థం ఓ డిన్నర్ ఇవ్వగా, దానికి కేవలం 15 మందినే పిలిచారు. వాళ్లలో లలిత్ మోదీ కూడా ఒకరు. ఆ సమయంలో ఆయనతో పాటు మరెవ్వరూ కూడా రాలేదని సుష్మా స్వరాజ్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
కాగా లండన్లోని భారత హై కమిషనర్ రంజన్ మత్తయి్ ఈ డిన్నర్కు రాలేదని స్పష్టం చేసింది. అయితే సుష్మా స్వరాజ్ ఇదే పర్యటనలో హిందుజా గ్రూప్స్కు చెందిన గోపి హిందూజా ఎన్నారైలకు ఇచ్చిన డిన్నర్లో కూడా పాల్గొన్నారు. ఈ డిన్నర్లో దాదాపు 300 మంది అతిథిలు హాజరయ్యారు. వారిలో కీత్వాజ్, లలిత్ మోడీతోపాటు రంజన్ మత్తయి్ ఉన్నారని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
లండన్లో పలు హోటళ్ల అధినేత జోగీందర్ సంగర్... సుష్మా స్వరాజ్కు కుటుంబ స్నేహితుడన్న విషయం తెలిసిందే. కానీ సుష్మాస్వరాజ్ ... లండన్లోని భారతీయ సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే సుష్మా తన మేనల్లుడికి సుసెక్స్ యూనివర్శిటీలో సీటు కోసం కీత్ వాజ్ని లలిత్ మోదీ కలిశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే లలిత్ మోదీ పోర్చుగల్ ప్రయాణానికి వీసా మంజూరుకు సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే లలిత్ మోదీకి మానవతా హృదయంతోనే వీసా మంజూరుకు సాయం చేశానన్న విషయాన్ని సుష్మా స్వరాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సుష్మా స్వరాజ్ కుటుంబానికి లలిత్ మోదీ ఫ్యామిలీ ప్రెండ్ అన్న విషయం విదితమే.