
జితేంద్రసింగ్ తోమర్(ఫైల్)
భాగల్పూర్: ఫోర్జరీ, నకిలీ డిగ్రీ కేసులో అరెస్టైన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ కు న్యాయ పట్టా ఇవ్వలేదని బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్టు తిల్కా మాంఝీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్ఎస్ దూబే తెలిపారు. తమ వర్సిటీ సిబ్బంది సహకారంతో తోమర్ నకిలీ పట్టా పొందినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో వివరాలు కోసం ఢిల్లీ పోలీసులు వస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
కోర్టు ఆదేశిస్తే తోమర్ ను తిల్కా మాంఝీ వర్సిటీకి తీసుకెళతామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపిన నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ స్పందించారు. వర్సిటీ ఉద్యోగుల సహయం లేకుండానే తోమర్ నకిలీ పట్టా తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.