'నా అరెస్టు చట్ట విరుద్ధం'
న్యూఢిల్లీ: ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు.
తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని, అరెస్టుకు ముందు కనీస పద్ధతులు కూడా పోలీసులు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా కోరారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించింది.