నకిలీ డిగ్రీ కేసులో తోమర్కు బెయిల్ మంజూరు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ న్యాయశాఖ మాజీమంత్రి జితేంద్ర సింగ్ తోమర్కు ఢిల్లీ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. నకిలీ డిగ్రీ కేసులో ఆయన గతంలో అరెస్టయిన విషయం తెలిసిందే.రూ. 50 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ ఇచ్చే షరతుల మీద అదనపు సెషన్స్ జడ్జి విమల్ కుమార్ యాదవ్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
ముందస్తు అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లకూడదని, అలాగే అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరు కావాలని కోర్టు తోమర్కు సూచించింది. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర నేరాల కింద తోమర్ను జూన్ 9న అరెస్టు చేశారు. ఈనెల 20వ తేదీ వరకు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కేసులో విచారణ పూర్తయింది కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరైంది.