ప్రదర్శనలో కాంగ్రెస్ డిమాండ్
భూషన్ చెప్పినప్పటికీ టికెట్ ఇచ్చారు
తెలిసి కూడా తోమర్‌ను మంత్రిని చేశారు
సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు
తనపై కుట్ర జరుగుతోంది: తోమర్
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ ‘లా’ డిగ్రీ పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జితేందర్ సింగ్ తోమర్‌ను మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రదర్శన నిర్వహించింది. తోమర్ డిగ్రీ నకిలీదని ప్రశాంత్ భూషణ్ తదితర నేతలు కేజ్రీవాల్‌కు తెలిపినప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వడమేకాక మంత్రిని చేశారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఆరోపించారు. దీనిపై కేజ్రీవాల్ నైతిక బాధ్యత వహించి గురువారం నాటికి తోమర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఢిల్లీ సచివాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. తోమర్ శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పీసీ చాకో మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ సర్కారు సిగ్గుపడవలసిన విషయమన్నారు. సీఎం కేజ్రీవాల్ వెంటనే తోమర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారలని డిమాండ్ చేశారు. నకిలీ డిగ్రీ ఉపయోగించడం నేరమని తెలిసి కూడా అలాంటి నేరానికి పాల్పడిన తోమర్‌కు జైలు శిక్ష పడుతుందని న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖీ వ్యాఖ్యానించారు. తమది నైతికత కలిగిన పార్టీగా చెప్పుకునే ఆప్ నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రి పదవిలో ఎలా కొనసాగిస్తోందని ప్రశ్నించారు.
వివాదంపై మంత్రి తోమర్ స్పందిస్తూ.. తనైపై, తమ పార్టీపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అన్ని విషయాలు త్వరలోనే తేటతెల్లమవుతాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తోమర్‌ను సంజాయిషీ కోరారు. విపక్షాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా కేజ్రీవాల్ మాత్రం తోమర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే యోచనలో ఉన్నట్లు కనిపించలేదు.
తోమర్‌ను తొలగించాల్సిందే
Published Wed, Apr 29 2015 1:13 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement